మోదీ పాలనలో దేశం సాగు సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. సర్కార్ సాయం చేతికందదు. పంటకొనే దిక్కులేదు. కొన్నా ధర దక్కదు. అప్పు తీరదు. దిక్కుతోచక బక్కరైతు బలవన్మరణానికి పాల్పడుతున్నడు. 2024లో దేశంలో 10,546 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 3,824 మంది, కర్ణాటకలో 2,971 మంది తనువుచాలించారు. ఎన్సీఆర్బీ -2024 గణాంకాలు చెప్తున్న కఠోర వాస్తవమిది. సాగు.. సావుగా మారిన నిష్ఠుర సత్యమిది.
హైదరాబాద్, మే 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘అచ్చేదిన్’ తెస్తామని గద్దెనెక్కిన కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజలకు సచ్చేదినాలను చూయిస్తున్నది. బీజేపీ పాలనలో అన్నంపెట్టే రైతన్నకు దిక్కులేకుండా పోయింది. మహిళలను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో ఆడబిడ్డలకు భద్రత కరువయ్యింది. దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. పసిమొగ్గలపై మృగాళ్ల దాడులు తీవ్రమయ్యాయి. మొత్తంగా దేశంలో నేరాలు-ఘోరాలు రాజ్యమేలుతున్నాయి. జాతీయ నేర గణాంక శాఖ (ఎన్సీఆర్బీ-2024) బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాలే దీనికి రుజువు. అంతేకాదు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు సామాన్యుల జీవితాలను కకావికలం చేస్తున్నాయి. ఇలా ముప్పేట దాడులతో ఒకవైపు పేద, మధ్యతరగతి ప్రజానీకం అల్లాడుతుంటే.. ప్రధాని మోదీ సహా అధికార పార్టీ నేతలందరూ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాలతో ఓట్ల వేటలో బిజీగా ఉండటం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.

నరేంద్ర మోదీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, దేశంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని జాతీయ నేర గణాంక శాఖ (ఎన్సీఆర్బీ)-2024 నివేదికను బట్టి అర్థమవుతున్నది. ప్రభుత్వం నుంచి ఆసరా లేకపోవడం.. అప్పుల బాధలు తాళలేక దేశంలో గంటకు ఓ రైతన్న ప్రాణాలు తీసుకొంటున్నట్టు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2024లో వ్యవసాయ రంగంలో పనిచేసే 10,546 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ నివేదిక కుండబద్దలు కొట్టింది. రైతు ఆత్మహత్యల్లో 36.26 శాతం వాటాతో బీజేపీపాలిత మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 28.17 శాతం వాటాతో కాంగ్రెస్ పాలిత కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ కారణాలతో 2024 ఒక్క ఏడాదిలోనే 1,70,746 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం తదితర సమస్యలతోనే దేశంలో ఆత్మహత్యలు పెరిగినట్టు నివేదికను బట్టి తెలుస్తున్నది.
మోదీ జమానాలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఎస్టీలపై నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2024లో ఎస్టీలపై నేరాలు 9,966గా నమోదయ్యాయి. 2024లో ఎస్టీలపై ఎక్కువ నేరాలు జరిగిన రాష్ర్టాల్లో 3,165 కేసులతో బీజేపీపాలిత మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక, 2024లో దేశవ్యాప్తంగా 27,049 హత్యలు జరిగాయి. 2024లో 1,01,928 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు 2024లో 15.21 శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. మొత్తంగా మోదీ ప్రభుత్వ హయాంలో నేరాలకు అడ్డాగా దేశం మారిందని, శాంతి-భద్రతలు, ప్రజా సంక్షేమం గాలిలో దీపంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ప్రతిరోజూ సగటున 546 మంది ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2024లో ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.99 లక్షల మంది మరణించారు. ఇది 2023తో పోలిస్తే 0.79 శాతం ఎక్కువ. 2023లో 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 2023లో 4.91 లక్షల నుంచి 2024లో 4.95 లక్షలకు పెరిగింది. ఇందులో రోడ్డు ప్రమాదాలు 4.67 లక్షలుగా ఉన్నాయి. ఇక, ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తంగా 4.52 లక్షల మంది గాయపడ్డారు.
ట్రాఫిక్ ప్రమాదాలలో రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు కూడా ఉన్నాయి. 2024లో నమోదైన 1.99 లక్షల ట్రాఫిక్ మరణాల్లో 1.75 లక్షల (88%) మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరిగాయి. ఎక్కువ రోడ్డు ప్రమాద మరణాలకు ద్విచక్రవాహనాల అతివేగమే కారణం. వీటివల్ల 84,599 మంది చనిపోయారు. మొత్తం రోడ్డు మరణాల్లో 58 శాతం మరణాలకు అతివేగమే కారణం. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఎక్కువ ప్రమాదాలు నమోదయ్యాయి. మొత్తం ప్రమాదాల్లో 20.8 శాతం ప్రమాదాలు ఈ మూడు గంటల్లోనే జరగడం గమనార్హం.
బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు టాప్-3 స్థానాల్లో ఉండటం గమనార్హం. 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1.87 లక్షల మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2023తో పోలిస్తే 2024లో పిల్లలపై నేరాలు 5.9 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.
రాష్ట్రం : మరణాలు
ఉత్తర్‌ప్రదేశ్ : 25,158
తమిళనాడు : 18,676
కర్ణాటక : 16,232
మధ్యప్రదేశ్ : 15,440
మహారాష్ట్ర : 15,249
వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు : 10,546
రైతులు : 4,633
రైతు కూలీలు : 5,913
ఏడాదికి : 10,546
రోజుకు : 29
నెలకు : 879
గంటకు 1 (సగటున)
