
న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావం వ్యవసాయ రంగంపై ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్ చంద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు మే నెలలోనే పెరిగాయని, అప్పటికి వ్యవసాయ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. మార్చిలో లేదా ఏప్రిల్ మధ్య వరకు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయని, తిరిగి వర్షాకాలంలో ఊపందుకుంటాయని పేర్కొన్నారు. కాబట్టి వ్యవసాయ రంగంపై కరోనా రెండో వేవ్ ప్రభావం ఉండబోదని చెప్పారు. రాయితీ, ధర, టెక్నాలజీపరంగా భారత్ అనుసరిస్తున్న విధానాలు వరి, గోధుమ, చెరకు పంటలకు చాలా అనుకూలంగా ఉన్నాయని, పప్పు ధాన్యాలకు అనుకూలంగా సేకరణ, కనీస మద్దతు ధర ఉండాలని పేర్కొన్నారు. 2021-22లో వ్యవసాయ రంగ అభివృద్ధి 3 శాతం కంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం వృద్ధి నమోదైందన్నారు.