Eknath Sinde : మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి గెలుపుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఓడినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మెజారిటీని ప్రతిపక్షాలు స్వాగతించాలని ఆయన సూచించారు.
గడిచిన రెండేళ్ల మహాయుతి కూటమి పాలనలో ఎన్నో పనులు చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని ఏక్నాథ్ షిండే చెప్పారు. దాని ఫలితమే ఈ ఎన్నికల్లో తమ విజయమని అన్నారు. ఇటీవల మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి, వాయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయని, అక్కడ వాళ్లే (ప్రతిపక్షాలు) గెలిచారని, కాబట్టి అక్కడ ఈవీఎంలు బాగున్నట్లని షిండే విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమకు 43.55 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి 43.71 శాతం ఓట్లు పోలయ్యాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. కేవలం 0.16 శాతం ఓట్ల తేడావల్ల వాళ్లు 31 స్థానాల్లో గెలిస్తే.. తాము 17 స్థానాల్లో మాత్రమే గెలిచామని తెలిపారు. అప్పుడు వాళ్లు ఈవీఎంలపై ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఈవీఎంల స్కామ్‌ను సాకుగా చూపి ఆదివారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదని, కానీ ఇవాళ చేశారని, అంటే ఒకరోజులో ఈవీఎంల స్కామ్ ముగిసిపోయిందా..? అని ఆయన నిలదీశారు.