న్యూఢిల్లీ, మే 16: ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై నిషేధం విధించలేదని, ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లేకపోవటంతో థియేటర్లలో చిత్ర ప్రదర్శన నిలిచిపోయిందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ చిత్రం విడుదల కాకుండా తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందంటూ ది కేరళ స్టోరీ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వారి ఆరోపణలను కొట్టిపారేస్తూ తమిళనాడు ప్రభుత్వం పైవిధంగా స్పందించింది. ఈమేరకు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘మే 7 నుంచి చిత్ర ప్రదర్శనను థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా నిలిపివేశారు. చిత్రానికి సరైన ఆదరణ లేకపోవటమే దీనికి కారణం’ అని అఫిడవిట్లో పేర్కొన్నది.