భోపాల్, జూలై 5: ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా ముఖ్య అనుచరుడు అయినందు వల్లే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నిందితుడు ప్రవేశ్ శుక్లాను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. కుబ్రి గ్రామంలో ప్రవేశ్ శుక్లా అక్రమంగా నిర్మించిన ఇంటిని జిల్లా అధికారులు కూల్చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు కేదార్నాథ్ శుక్లా, రాజేందర్ శుక్లాతో నిందితుడు కలిసివున్న ఫొటోలు సోషల్మీడియాలో విడుదలయ్యాయి. ఘటన అత్యంత హేయమైందిగా బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ‘ఎన్ఎస్ఏ కేసు పెడితే సరిపోదు, బుల్డౌజర్ పంపి అతడి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి’ అని డిమాండ్ చేశారు.