భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి తన మీద మూత్రం పోసిన ఘటన గురించి బాధితుడు దశ్మత్ రావత్ స్పందించాడు. ఆ ఘటన ఇప్పటిది కాదని, 2020లో జరిగిందని చెప్పాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు అవుతుందని, తాను మా ఇంటి దగ్గర దుకాణం ముందు మెట్లపై కూర్చుని ఉన్నానని, అప్పుడే ఓ వ్యక్తి వచ్చి తన తలపై మూత్రం పోశాడని తెలిపాడు.
ఆ ఘటనపై జరిగినప్పుడు తాను తల పైకి కూడా ఎత్తలేదని, అతనెవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నాడు. ఈ విషయం గురించి మూడేళ్లుగా తాను ఎవరికీ చెప్పను గూడా చెప్పలేదని తెలిపాడు. అప్పట్లో ఆ వీడియో ఎవరు తీశారోగానీ, ఆ వీడియోవల్ల ఇప్పుడు విషయం బయటికి వచ్చిందన్నాడు. తాను సాధారణ కూలీనని, పెద్దవాళ్లతో పెట్టుకుని బతుకలేనని చెప్పాడు.
ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు.