లక్నో: తోడేళ్లు విజృంభిస్తున్నాయి. గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని పసి పిల్లలను ఎత్తుకుపోయి చంపి తింటున్నాయి. తోడేళ్ల దాడుల్లో గత రెండు నెలల్లో ఏడుగురు పిల్లలు, ఒక మహిళ సహా 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. (Killer Wolves) దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ఎక్కువగా ఉంది. పలు గ్రామాల్లో అవి సంచరిస్తున్నాయి. ఖరీఘాట్‌లోని ఛత్తర్‌పూర్‌లో మంగళవారం తెల్లవారుజామున మూడు, ఆరు, తొమ్మిదేళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలపై తోడేళ్లు దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రించిన ఐదేళ్ల పిల్లవాడిని నోట కరుచుకుని తీసుకెళ్లి చంపి తిన్నాయి.
కాగా, గత 40 రోజుల్లో తోడేళ్ల దాడుల సంఘటనలు 30 నమోదయ్యాయి. గత రెండు నెలల్లో తోడేళ్ల దాడుల్లో ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఎనిమిది మంది మరణించారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మంగళవారం గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో నిద్రించవద్దని ప్రజలకు సూచించాలని కోరారు. అలాగే సీనియర్ పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. తోడేళ్ల దాడులను అరికట్టే చర్యలపై చర్చించారు.
మరోవైపు తోడేళ్ల దాడులను నియత్రించే ఆపరేషన్‌లో నాలుగు జిల్లాల డివిజనల్ ఫారెస్ట్ అధికారులు నిమగ్నమయ్యారు. తోడేళ్ల గుంపు కదలికలను పర్యవేక్షించేందుకు హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. అలాగే గ్రామాలపై తోడేళ్ల దాడులను నివారించేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగు పేడ, మూత్రంతో తోడేళ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.