HFEA | న్యూఢిల్లీ: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే సంతానాన్ని పొందే రోజులు త్వరలో రాబోతున్నాయి. దీంతో స్వలింగ జంటలు సైతం సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ అసాధ్యం వచ్చే పదేండ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ వీర్యాన్ని, అండాలను ప్రయోగశాలలో వృద్ధి చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చేరువైనట్టు మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి శాస్త్ర(హెచ్ఎఫ్ఈఏ) బోర్డు గత వారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది.
మానవ ఫలదీకరణ, పిండ శాస్ర్తానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు 2023లో కొన్ని ప్రతిపాదనలు చేసిన హెచ్ఎఫ్ఈఏ.. ల్యాబ్లో మానవ వీర్యాన్ని, అండాలను వృద్ధి చేయడాన్ని వైజ్ఞానిక రంగం సాధించిన విప్లవాత్మక పురోగతిగా అభివర్ణించింది. నైతికంగా ఇది ఎంతో వివాదాస్పదమైన పురోగతే అయినప్పటికీ దీన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్టు స్పష్టం చేసింది.
ల్యాబ్లో పెంచిన అండాలు, వీర్యం సాయంతో తల్లిదండ్రులు తమ భవిష్యత్తు సంతానాన్ని నచ్చినట్టుగా కస్టమైజ్(అభిరుచికి తగిన మార్పులు) చేసుకోవచ్చని తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఎలుకల నుంచి కొన్ని పిల్లలను, జీవ సంబంధీకులైన ఇద్దరు తండ్రుల నుంచి ఓ బిడ్డను ఉత్పత్తి చేశారని హెచ్ఎఫ్ఈఏ వెల్లడించింది.