న్యూఢిల్లీ, అక్టోబర్ 26: జన్యుమార్పిడులు చేసిన (జీఎం) ఆవాల పంటలు వేసేందుకు జన్యు ఇంజినీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) పచ్చజెండా ఊపింది. ఢిల్లీ యూనివర్సిటీ రూపొందించిన డీఎంహెచ్-11 రకానికి చెందిన ఆవాలను పంటల కోసం విడుదల చేయొచ్చని సిఫారసు చేసింది. ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే భారత్ అనుమతించిన తొలి జీఎం ఆహార పంట ఇదే అవుతుంది. 2002లో ప్రభుత్వం బీటీ కాటన్ను అనుమతించిన సంగతి తెలిసిందే. మనదేశం ప్రస్తుతం 70 శాతం దాకా వంటనూనెలను దిగుమతి చేసుకొంటున్నది.
స్వదేశీ నూనె ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ఇప్పుడు జీఎం ఆవపంటపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్, జన్యుశాస్త్రవేత్త దీపక్ పెంటల్ డీఎంహెచ్-11 రకం జీఎం ఆవాలను అభివృద్ధి చేశారు. దేశంలో ధారా పేరుతో వివిధ రకాల నూనెలను మార్కెటింగ్ చేస్తున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది.
జీఎం ఆవాల అనుమతి కోసం చాలాకాలంగా ఎదురు చూశాం.. ఆలస్యమైనా మొత్తం మీద సానుకూల నిర్ణయం రావడం హర్షణీయమని పెంటల్ మీడియాతో చెప్పారు. జీఎం ఆవాల వాణిజ్య సేద్యానికి మార్గం సుగమం అవుతున్నదని, మరికొన్ని కొత్త వంగడాల అభివృద్ధికి ప్రైవేటు కంపెనీలతో కలిసి కృషి చేస్తామని ఆయన వివరించారు. జన్యుమార్పిడి పంటలను స్వదేశంలో అనుమతించని సర్కారు అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా తదితర దేశాల నుంచి జీఎం నూనెలను దిగుమతి చేసుకుంటున్నది. 2021-22 సంవత్సరంలో 41 లక్షల టన్నుల జీఎం సోయాబీన్ నూనెను విదేశాల నుంచి కొనుగోలు చేసింది.