SDG | న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణపై దేశప్రజలు చేస్తున్న ఖర్చు పరిమితులు దాటుతున్నది. దాదాపు 9 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో ‘విపత్తు’ స్థాయిలను దాటేస్తున్నారు. కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఆరోగ్య సంరక్షణకే ఖర్చు చేస్తున్నారు. సైస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు 2023 ప్రకారం.. 31 మిలియన్ల మంది తమ కుటుంబ వ్యయంలో నాలుగింట ఒక వంతు ఆరోగ్య సంరక్షణపైనే ఖర్చు చేస్తున్నారు.
2017-18, 2022-23 మధ్య ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చు 10-25 శాతానికి పెరిగింది. హెల్త్‌కేర్‌పై 10 శాతానికిపైగా ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య 4.5 నుంచి 6.7 శాతానికి పెరిగింది. 25 శాతానికిపైగా ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య 1.6 నుంచి 2.3 శాతానికి పెరిగింది. 2022-23లో కేరళలో 16 శాతం కుటుంబాలు 10 శాతానికిపైగా ఖర్చు చేస్తే, వారిలో 6 శాతం కుటుంబాలు 25 శాతానికిపైగా ఖర్చు చేయడం గమనార్హం.