(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): లక్షలాది మంది పింఛన్‌దార్లు గత కొన్నేండ్లుగా పెట్టుకొన్న ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) కింద దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస పింఛన్ పెరుగుదల మళ్లీ తీరని కలగానే మిగిలిపోయింది. పింఛన్ మొత్తాన్ని పెంచడం సాధ్యంకాదని కేంద్రం తేల్చిచెప్పింది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణంగా చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం, కేంద్ర ఖజానాపై పడే భారాన్ని విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు.
ఈపీఎఫ్ కనీస పింఛన్ పెంపు కోసం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. 2014 లో కనీస పింఛను రూ. 1000 అమల్లోకి వచ్చేవరకూ.. కొందరికి దశాబ్దాల కాలంపాటు రూ. 100 లోపే పింఛన్ వచ్చేది. ప్రస్తుతం రూ. 2 వేల లోపు పింఛన్ పొందుతున్నవారు 80 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. ఈ మొత్తం తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు సామాజిక భద్రత కోసం ఇస్తున్న సొమ్ముకన్నా తక్కువ. దీంతో పింఛన్ కనీస మొత్తాన్ని రూ. 9 వేలకు పెంచాలని కార్మిక సంఘాలు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అడ్‌హక్ వంటి పలు కమిటీలను వేస్తూ కాలయాపన చేసిన కేంద్రప్రభుత్వం చివరకు పింఛన్ మొ త్తాన్ని పెంచేది లేదం టూ చావుకబురు చల్ల గా చెప్పింది. మోసా లు చేసి, బ్యాంకులకు ఎగనామం పెట్టిన ఆర్థిక నేరగాళ్లకు సం బంధించి రూ. 10 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసిన కే్ంర దం.. సామాన్యుల ఆర్థిక కష్టాలను పట్టించుకోవట్లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
పింఛనుదారులకు కనీస పింఛను పెంపును పట్టించుకోని కేంద్రప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు కూడా మొండిచేయి చూయిస్తున్నది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 1977-78 తర్వాత ఇదే కనిష్ఠ వడ్డీరేటు. దీంతో 6.8 కోట్ల మంది మధ్యతరగతి చందాదారులపై తీవ్రప్రభావం పడుతున్నది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకూ పీఎఫ్ డిపాజిట్ల వడ్డీరేటుపై 0.65 కోత పెట్టారు.
రెక్కలు విరిగేలా 27 ఏండ్లు ఉద్యోగం చేసి రిటైరయ్యా. ఇప్పుడు నెలకు రూ. 1000 పింఛనుగా ఇస్తున్నారు. ఈ రోజుల్లో రూ. వెయ్యితో ఎలా బతకాలి? ఆ డబ్బుతో ఒక్క ఎల్పీజీ సిలిండర్ కూడా రావట్లే.
-చంద్రకాంత్, సాంగ్లీ, మహారాష్ట్ర
సామాన్యులకు పింఛన్లను ఇచ్చేందుకు మనసురాని కేంద్రప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లకు కొమ్ముకాస్తూ రూ. 10 లక్షల కోట్లను రైటాఫ్ చేసింది. అబద్ధాలు, మోసంతో మనుగడ సాగించే ప్రభుత్వమిది.
-సంజయ్ ఝా, కాంగ్రెస్ నేత