న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పండుగల నేపథ్యంలో బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించనున్నట్టు తెలిపింది. ఇందుకు రూ.2028.57 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. లోకో పైలెట్లు, గార్డులు, టెక్నీషియన్ హెల్పర్స్ వంటి నాన్గెజిటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఈ బోనస్ కింద ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 లభిస్తుంది. కాగా, ఈ ఉత్పాదక అనుసంధానిత బోనస్ ఆరో వేతన కమిషన్ సిఫార్సులకు బదులుగా ఏడో వేతన కమిషన్ను బట్టి ఇవ్వాలని రైల్వే సంఘాలు గురువారం సామాజిక మాధ్యమంలో ప్రచారాన్ని ప్రారంభించాయి.