హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ యువతి సైనా నెహ్వాల్‌కు వ్యతిరేకంగా సినిమా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ మహిళా కమిషన్ సహా పలు మహిళా సంఘాలు సిద్ధార్థ్ ట్వీట్‌ను తప్పుపట్టాయి. సైనా నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ తన అభిప్రాయాన్ని అలాంటి పదాలను ఉపయోగించి కాకుండా కొంచెం మంచి పదాలను ఉపయోగించి చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
తాజాగా సైనా తండ్రి హర్వీర్సింగ్ నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓ సినిమా నటుడు నా కూతురు సైనా నెహ్వాల్ గురించి అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేశాడు. అతను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. నేను ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ నటుడు కచ్చితంగా నా బిడ్డకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అని హర్వీర్సింగ్ డిమాండ్ చేశారు.
కాగా, సైనా నెహ్వాల్ ఈ నెల 5న ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఒక దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం..? ప్రధాని మోదీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అని సైనా ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు అని పేర్కొన్నారు.