హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పుష్పక్ బస్సుల్లో వాట్సాప్ ద్వారా టిక్కెట్ జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఆర్టీసీ వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని మెస్సేజ్ పంపిస్తే.. వివరాలు అడుగుతుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత యూపీఐ పేమెంట్మోడ్లోకి వెళ్తుంది. డబ్బు చెల్లింపు తర్వాత వాట్సాప్‌లోనే క్యూఆర్ కోడ్ టికెట్ జారీ అవుతుంది.
కేవైసీ కోసం తిప్పలు
పీఎఫ్ ప్రయోజనాల కోసం వివరాల్లో సవరణ చేసుకునేందుకు బస్‌భవన్‌లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిపోల వారీగా ఎవరు ఏ రోజున కేవైసీకి వెళ్లాలో సూచించారు. కానీ, సర్వర్‌లో సమస్యలు తలెత్తుతుండటంతో కేవైసీ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని సిబ్బంది వాపోతున్నారు.