టొరంటో: కెనడాలోని ఒంటారియో ప్రావిన్సులో రోడ్డు ప్రమాదం(Canada Accident) జరిగింది. ఆ ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతిచెందారు. వాళ్లు ప్రయాణిస్తున్న టెస్లా ఎలక్ట్రిక్ కారు.. హైవేపై ఉన్న గార్డ్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో నలుగురు దగ్దమైనట్లు తెలుస్తోంది. లేక్ షోర్ బౌల్వార్డ్ ఈస్ట్, చెర్రీ స్ట్రీట్ వద్ద గత గురువారం ప్రమాదం జరిగినట్లు టొరంటో పోలీసులు వెల్లడించారు.
టెస్లా కారులో 25 నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్న అయిదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. దీంట్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కారు అదుపు తప్పి గార్డు రెయిల్తో పాటు కాంక్రీట్ పిల్లర్‌ను ఢీకొట్టింది. కాంక్రీట్‌ను ఢీకొన్న తర్వాత కారులో భారీ స్థాయిలో మంటలు చెలరేగినట్లు పోలీసులు చెప్పారు. అధిక వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు టొరంటో పోలీసు ఫిలిప్ సింక్లెయిర్ తెలిపారు. అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు వదిలారు.
25 ఏళ్ల ఓ మహిళ మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న కెనడా పోస్టల్ ఉద్యోగి ఒకరు కాలుతున్న కారు నుంచి ఆమెను రక్షించాడు. నలుగురి మృతి పట్ల భారతీయ కౌన్సులేట్ విషాదాన్ని వ్యక్తం చేసింది. తన ఎక్స్ అకౌంట్లో ప్రమాదంపై రియాక్ట్ అయ్యింది. బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నట్లు భారతీయ కౌన్సులేట్ వెల్లడించింది.