కర్నాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు బెల్గావీలో గుంపులు గుంపులుగా తిరగడాన్ని నిషేధించారు. తాజాగా మరో వివాదం చెలరేగింది. బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంక్ పూశారు. దీంతో మహారాష్ట్రీయులు బెల్గావీలోని శంభాజీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు. దోషులను గుర్తించి, వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నిరసన అదుపు తప్పింది. ఈ గొడవలో ప్రభుత్వానికి సంబంధించిన 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇక… స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలీ రాయన్న విగ్రహం కూడా ధ్వంసమైంది. దీంతో బెళగావీలో టెన్షన్ నెలకొంది. దీనిపై కర్నాటక హోంమంత్రి స్పందించారు. శివాజీ విగ్రహానికి ఇంక్ పూసినవారిని వెంటనే గుర్తించి, శిక్షిస్తామని, అలాగే సంగోలీ రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కూడా శిక్షిస్తామని ప్రకటించారు. రాజకీయాల కోసం మహా వ్యక్తులను కించపరచడం ఏమాత్రం భావ్యం కాదని హోంమంత్రి హితవు పలికారు.
బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 13న మహారాష్ట్ర ఏకీకరణ సమితి అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టింది. ఆ సమయంలో కొందరు కన్నడ నిరసన కారులు మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి నేత దీపక్ దల్వీ మొహంపై ఇంకు చల్లారు. దీంతో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి.