న్యూఢిల్లీ: ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా దాడి జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ద్వీపంలో ఉచ్చుల ఏర్పాటు, అదనపు సైనిక సిబ్బంది, గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపు వంటి చర్యలను ఇరాన్ ముమ్మరం చేసినట్లు అమెరికా నిఘా సంస్థకు చెందిన వర్గాలు వెల్లడించాయి. భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన పక్షంలో అమెరికా దళాలు ద్వీపంపై అడుగుపెట్టిన వెంటనే ద్వీపం వ్యాప్తంగా, తీరం వెంబడి మందుపాతరలు అమర్చాలని ఇరాన్ యోచిస్తున్నట్లు సీఎన్ఎన్ తెలిపింది.
ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెండు భారీ యుద్ధ నౌకలు, వేలాదిమంది నౌకాదళ సిబ్బందిని, 1,000 మంది సైనిక సిబ్బందిని పంపాలని అమెరికా భావిస్తున్నది. భూతల ఆపరేషన్‌తో ప్రాణనష్టంతో పాటు గణనీయ స్థాయిలో ముప్పు కూడా పొంచి ఉంటుందని అమెరికన్ అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖర్గ్ ద్వీపంపై ఇరాన్ అంచెల వారీగా రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడా ఇటీవల ద్వీపంపై ఇరాన్ మోహరించింది.
ఖర్గ్‌ను ఆక్రమించుకోవడానికి భూతల దళాలను పంపాలన్న అమెరికా యోచనను గల్ఫ్ మిత్రులు సైతం వ్యతిరేకించారు. ఆ పని చేయవద్దని వారు వ్యక్తిగతంగా ట్రంప్ ప్రభుత్వాన్ని అర్థించారు. ఖర్గ్ని అమెరికా దళాలు ఆక్రమిస్తే భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతుందని, అది గల్ఫ్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పురిగొల్పుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌కు ఆర్థిక జీవనాడిగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకోవడం ద్వారా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడానికి ఇరాన్‌పై ఒత్తిడి పెంచవచ్చని అమెరికా భావిస్తున్నది.
అమెరికా జవాన్లకు వర్క్‌ఫ్రమ్‌హోమ్!
ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ స్థావరాలకు భారీ నష్టం వాటిల్లిందని, 13 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని ‘ద న్యూయార్క్ టైమ్స్’ తాజా కథనం పేర్కొన్నది. అమెరికా అధికారులు, సైనిక సిబ్బందిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం, ‘సైనిక స్థావరాలు ధ్వంసం కావటంతో వేలాది మంది సైనికులు హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లారు. యుద్ధ భూమిలో అమెరికా సైన్యం చెల్లాచెదురైంది. గల్ఫ్‌లో మిగిలిన సైనిక స్థావరాలను కూడా అమెరికా దీర్ఘకాలం కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయి’ అని పేర్కొన్నది.