లక్నో: ఒక స్కూల్ టీచర్ విద్యార్థిని దారుణంగా కొట్టాడు. అతడి కాలు విరిచాడు. (teacher breaks student leg) ఇది తెలిసి స్టూడెంట్ తల్లి నిలదీయడంతో చికిత్స కోసం రూ.200 ఇచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ప్రైవేట్ స్కూల్కు చెందిన టీచర్ హర్షిత్ తివారీ క్లాస్లో మూడో తరగతి విద్యార్థిని ప్రశ్న అడిగాడు. సమాధానం చెప్పకపోవడంతో పదేళ్ల బాలుడి పట్ల ఆగ్రహం చెందాడు. కులం పేరుతో దూషించాడు. ఆ విద్యార్థిని కొట్టాడు. గోడ కుర్చీ, ఒంగడం వంటి శిక్షలు విధించాడు. ఆ బాలుడి వీపుపై టీచర్ కూర్చొన్నాడు. దీంతో అదుపుతప్పి కిందపడటంతో ఆ విద్యార్థి కాలు విరిగింది.
కాగా, ఆ స్టూడెంట్ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు అతడ్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలుడి కాలు విరుగడంతోపాటు వినికిడి సమస్య వచ్చినట్లు నిర్థారించారు. విరిగిన కాలుకు కట్టుకట్టారు.
మరోవైపు ఆ విద్యార్థి తల్లి స్కూల్కు వెళ్లింది. తన కుమారుడిపై దాడి చేసి కాలు విరగ్గొట్టిన టీచర్ హర్షిత్ తివారీని నిలదీసింది. ఈ నేపథ్యంలో బాలుడి చికిత్స కోసం అతడి తల్లికి రూ.200 ఇచ్చాడు. అయితే ఆ స్టూడెంట్ పేరెంట్స్ దీని గురించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడు హర్షిత్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.