పుణె, ఆగస్టు 5: టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్‌కు ఒక ఉద్యోగి షాకిచ్చాడు. తనకు జీతం ఇవ్వకుండా అద్దెకట్టలేని స్థితిలో రోడ్డున పడేసిన కంపెనీ వైఖరిని నిరసిస్తూ ఆ కంపెనీ ఎదురుగానే ఫుట్‌పాత్‌పై పడుకోవడం ప్రారంభించాడు. మహారాష్ట్రలోని పుణెలో టీసీఎస్ కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌పై ఒక ఉద్యోగి పడుకుని ఉన్న చిత్రం సామాజిక మాధ్యమంలో ఇప్పుడు వైరల్ అవుతున్నది. సహ్యాద్రి పార్కు క్యాంపస్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో అతడి చిత్రాన్ని ఎక్స్‌లో షేర్ చేసిన ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపింది. సౌరభ్ మోరే అనే ఆ ఉద్యోగి టీసీఎస్ కంపెనీ జీతం చెల్లించకపోవడంతో అద్దె కట్టలేక జూలై 29 నుంచి ఫుట్‌పాత్‌పైనే పడుకుంటున్నాడని, అయినా అతని దుస్థితిపై కంపెనీ చలించడం లేదని ఆరోపించింది. ఆ మేరకు బాధితుడు తాను పడుకున్న చోటే ఒక నోట్ కూడా పెట్టాడని తెలిపింది. దీనిపై టీసీఎస్ హెచ్ఆర్ విభాగం వివరణ ఇస్తూ అతను అనధికారికంగా విధులకు గైర్హాజరీ అయ్యాడని, అతని పే రోల్ కూడా సస్పెండ్ అయ్యి ఉందని తెలిపింది. అయితే జూలై 31 లోగా తన పెండింగ్ జీతం ఇస్తామని చెప్పిన హెచ్ఆర్ మాట నిలబెట్టుకోలేదని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఉద్యోగి తిరిగి విధులకు రిపోర్ట్ చేశాడని, అతడికి తాము వసతి సౌకర్యం కూడా కల్పించామని, అతనికి అన్ని విధాల సహకారం అందిస్తామని టీసీఎస్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.