Tax Clearance | న్యూఢిల్లీ, జూలై 28: విదేశాలకు వెళ్లేవారంతా తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలంటూ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. బడ్జెట్లో ప్రతిపాదించిన సవరణ అందరికీ వర్తించబోదని, ఆర్థిక అవకతవకలకు పాల్పడినవారు లేదా పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను పొందేందుకు చేయాల్సిన పనుల్లో ‘బ్లాక్ మనీ యాక్ట్-2015’కు వర్తించే నిబంధనలను కూడా చేర్చాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. దీంతో ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను పొందాలనుకునేవారు తమ బకాయిలన్నింటినీ క్లియర్ చేయాల్సి ఉంటుంది.
ప్రతిపాదిత సవరణ ప్రకారం భారత్లో నివసించేవారంతా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను పొందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినవారితోపాటు ఆదాయ పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రమేయం ఉన్నవారు, రూ.10 లక్షల కంటే అధికంగా ప్రత్యక్ష పన్ను బకాయిలు ఉండి వాటిపై ఎలాంటి స్టే లేనివారు మాత్రమే ఈ సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుందని వివరించింది. సరైన కారణాలను చూపించి ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా చీఫ్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఏ వ్యక్తి నుంచైనా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను కోరుతామని ఐటీ విభాగం తెలిపింది. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను పొందాలనుకునేవారికి ఎలాంటి బకాయిలు లేవని ధ్రువీకరిస్తూ ఐటీ విభాగం ఆ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది.