చెన్నై: శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన కే పొన్ముడిని (K Ponmudy) మంత్రిగా నియమించాలని తమినాడు సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్కు సిఫార్సు చేశారు. పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతూ ఆదివారం రాశారు. అయితే దీనిని ఆమోదించేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించారు. నేరారోపణలను సుప్రీంకోర్టు కొట్టివేయక కేవలం స్టే ఇచ్చినందున పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించలేమని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం లేఖ పంపారు.
మరోవైపు కే పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరుపాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, 2006 నుంచి 2011 వరకు నాటి డీఎంకే హయాంలో కే పొన్ముడి ఉన్నత విద్య, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2011లో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నేత, మంత్రి అయిన కే పొన్ముడిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా ట్రయిల్ కోర్టు నిర్ధారించింది. అలాగే మూడేళ్లు జైలు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో పొన్ముడి శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి మంత్రిగా నియమించాలని గవర్నర్కు ప్రభుత్వం సిఫార్సు చేసింది.