Tamil Nadu : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తున్నప్పటికీ, ఇతర పార్టీల నుంచి సరైన మద్దతు లభించడం లేదు. మిగతా పార్టీల్లో కొన్ని డీఎంకేతో, ఇంకొన్ని ఏఐఏడీఎంతో పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు టీవీకేతో కలవాలంటే ఈ పొత్తులు వదులుకోవాలి. అలా కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డా.. ఇతర సమస్యలున్నాయి.
అందువల్ల ఏ పార్టీ కూడా విజయ్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వలేకపోతోంది. ఇదే సమయంలో తమిళనాడులో సరికొత్త కూటమి ఏర్పాటుపై ప్రచారం జరుగుతోంది. బద్ధ శతృవులైన డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై విజయ్ కూడా స్పందించాడు. ఒకవేళ డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన టీవీకే తరఫున ఎన్నికైన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆయన హెచ్చరించారు. విజయ్ టీవీకే ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ముందుగా డీఎంకే, ఏఐఏడీఎంకే సానుకూలంగానే స్పందించాయి. కానీ, విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకాకపోవడంతో డీఎంకే, ఏఐఏడీఎంకే చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే, ఏఐఏడీఎంకేతో పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని డీఎంకే ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ ఈ ప్రచారంలో నిజం లేదన్నాడు. ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపాడు. గవర్నర్ విజయ్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నెల 10 వరకు గడువు ఇచ్చాడని, ఆ లోపు అతడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఏఐఏడీఎంకేతో పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని ఎలంగోవన్ తెలిపారు. అయితే, డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు అంశాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఈ పొత్తు అనైతికం అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటు విజయ్, అటు డీఎంకే కూటమి.. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చూడాలి.