TVK Vijay : ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా ప్రచారం చాలా ముఖ్యం. పార్టీ అధినేతలు ఎంత ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తే, అంత ప్రభావం ఉంటుంది. అలాంటిది, తమిళనాడులో కొత్త పార్టీ అయిన టీవీకే అధినేత, నటుడు విజయ్ మాత్రం ప్రచార ర్యాలీలు రద్దు చేసుకుంటూ సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన కొన్ని ర్యాలీల్ని విజయ్ రద్దు చేసుకోగా, షెడ్యూలై ఉన్న మరికొన్ని ర్యాలీల్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
రెండు రోజుల ముందు వరకు ప్రచారానికి అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 15న విడుదలైంది. ఈ లెక్కన విజయ్ అనేక నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. కానీ, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ర్యాలీలు, సభలకు హాజరవుతున్నారు. విల్లివక్కం, తిరుచిరాపల్లి, పుదుచ్చేరి, టీనగర్, కుడ్డలూర్ వంటి కొన్ని నియోజకవర్గాల్లో ర్యాలీల్ని రద్దు చేశారు. త్వరలో హాజరవ్వాల్సిన ఇంకొన్ని ర్యాలీల్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇందులో కొన్నింటికి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే, ప్రచార కార్యక్రమాల రద్దు అంశంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ, పార్టీవర్గాల ప్రకారం ప్రభుత్వం సరైన అనుమతులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం తమ ప్రచార కార్యక్రమాల్ని అడ్డుకుంటోందని టీవీకే ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆయన ర్యాలీలకు సమయం తక్కువగా ఇవ్వడం, సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
అలాగే, రవాణాపరమైన సమస్యలు కూడా కారణాలుగా చెబుతున్నారు. ఇక, గత ఏడాది కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందుకే ముందు జాగ్రత్త చర్యగా, ఇలాంటి ఘటనలు జరగకుండా విజయ్ కొన్ని ర్యాలీలు రద్దు చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీవీకేకు ప్రధాన ఆకర్షణ విజయ్. అలాంటిది ఆయనే ప్రచారానికి రాకపోవడంతో టీవీకే తరఫున పోటీ చేస్తున్న నేతలు ఇబ్బంది పడుతున్నారు.