Female Doctor Case | తమిళనాడు వెల్లూరులో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో తమిళనాడు మహిళా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు నిందితులకు కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.25వేల జరిమానా విధించింది. 2022లో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనను పలువురు సభ్యులు శాసనసభలో లేవనెత్తారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. మార్చి 16, 2022న, తమిళనాడులోని వెల్లూరులో ఒక మహిళా వైద్యురాలు తన స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్లారు. సినిమా అయ్యాక అర్ధరాత్రి ఇద్దరూ థియేటర్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో ఆటో అటువైపుగా వచ్చింది. అప్పటికే ఆ ఆటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. సదరు వైద్యురాలు డ్రైవర్ని ఆసుపత్రి వరకు వెళ్లాలని చెప్పింది. ఆ తర్వాత ఆటో ఎక్కి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే కాకుండా.. మరో రూట్లో వెళ్లడంతో పాటు ఆటోను స్పీడ్‌గా నడపడం మొదలుపెట్టాడు. సదరు వైద్యురాలు ఎందుకు వేరే రూట్లో వెళ్తున్నామని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. రాత్రి సమయంలో ఆ రూట్ మూసి ఉంటుందని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత శ్మశానవాటిక సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆటోను నిలిపాడు.
ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులతో పాటు డ్రైవర్ వైద్యురాలితో పాటో ఆమె మిత్రుడిని కొట్టి బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద రూ.40వేలతో పాటు బంగారాన్ని సైతం లూటీ చేశారు. లేడీ డాక్టర్ కొద్దిరోజులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొద్దిరోజులకు ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాగిన మత్తులో సామూహిక అత్యాచారం చేసినట్లు అంగీకరించారు.
కొద్దిరోజులకు మిగతా నిందితులను సైతం అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ పార్థిబన్, రోజువారీ కూలీ మణి అలియాస్ మణికందన్, అతని స్నేహితులు భరత్, సంతోష్‌లను అరెస్టు చేశారు. ఐదో నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన వెల్లూరు సెషన్స్ (ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) జడ్జి ఎస్ మాగేశ్వరి భాను రాక ముందు నిందితులను హాజరుపరచగా.. నలుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగారా శిక్ష విధించారు. రూ.25వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.