బెంగళూరు: మైసూరు శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. రెండేళ్లపాటు ఆమె ఈ సబ్బును ప్రమోట్ చేస్తారు. అయితే, ఆమెను ఎంపిక చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినీ రంగంలో నటీమణుల కొరత ఉందా? అని నిలదీస్తున్నారు. “మన రుక్మిణి వసంత్ ఉంది కదా” అని గుర్తు చేస్తున్నారు.
అవకాశం ఇస్తే ఉచితంగా ప్రమోట్ చేయడానికి అనేక మంది కన్నడిగులు ఉన్నారని, సినీ రంగానికి చెందని వారిని కోరితే సంతోషంగా ప్రమోషన్లో భాగస్వాములవుతారని చెప్తున్నారు. నిష్కారణంగా ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ, ఈ సబ్బు కర్ణాటక వెలుపలి మార్కెట్లకు కూడా విస్తరించాల్సి ఉందన్నారు. అనేక రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.