Zakir Hussain | తబలా వాయిద్య కారుడు జకీర్ హుస్సేన్ (73) ఆదివారం కన్నుమూశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో గల ఓ దవాఖాన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో గుండె సంబంధ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. బీపీతో జకీర్ హుస్సేన్ బాధ పడుతున్నారని ఆయన మేనేజర్ తేలిపారు. ప్రముఖ తబలా వాయిద్యా కారుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడే జకీర్ హుస్సేన్. తబలా వాయిద్యంలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన జకీర్ హుస్సేన్.. దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చారు.
వారం రోజులుగా జకీర్ హుస్సేన్ గుండె సంబంధ ఆరోగ్య సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కో లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1988లోనే పద్మ శ్రీ, 2002లో పద్మ భూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. సంగీత నాటక్ అకాడమీ అవార్డుతోపాటు రెండు సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.
1951 మార్చి తొమ్మిదో తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జకీర్ హుస్సేన్ జన్మించారు. కథక్ నృత్యకారణి, తన మేనేజర్ అంటోనియా మిన్నెకొలాను పెండ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు – అనిషా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషీ ఉన్నారు. యూసీఎల్ఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిషా ఒక సినిమా నిర్మాతగా ఉన్నారు. మాన్ హట్టన్ లోని ఇసాబెల్లా నృత్యవిద్యనభ్యసించారు.