Sylvester daCunha | ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల బ్రాండ్ అమూల్ గర్ల్ యాడ్ సృష్టికర్త, ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణు సిల్వెస్టర్ డాకున్హా (80) కన్నుమూశారు. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముంబయిలో డాకున్హా కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ సిల్వెస్టర్ మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. సిల్వెస్టర్ డాకున్హా 1966లో జీసీఎంఎంఫ్ యాజమాన్యంలోని అమూల్ బ్రాండ్ కోసం ‘అట్టర్లీ బటర్లీ’ యాడ్ కోసం ‘అమూల్ గర్ల్’ని పరిచయం చేశారు. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌లో కనిపించే పాపాయి కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో కొత్త గుర్తింపు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు అమూల్ గర్ల్‌ను కంపెనీ నేటికీ కొనసాగుతున్నది. ఆయన మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నివాళులర్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సిల్వెస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రకటనల రంగంలో అగ్రగామిగా నిలిచారని కొనియాడారు. అమూల్ జనరల్ మార్కెటింగ్ మేనేజర్ పవన్ సింగ్ సైతం సిల్వెస్టర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం నడిచే వాణిజ్య ప్రకటనల్లో అమూల్ గర్ల్ ఒకటని ఆయన అన్నారు. ప్రకటనలతో కంపెనీ కొత్త శిఖరాలను తాకిందని చెప్పారు.