న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (SRISIIM) మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswati) అలియాస్ పార్థసారధిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఎస్ఆర్ఐఎస్ఐఐఎం నడుస్తున్నది. దానికి మేనేజర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. బలహీనవర్గాల కేటగిరీలో పీజీ మేనేజ్మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆశ్రమంలోని 32 మంది విద్యార్థినులను పోలీసులు విచారించారు. వీరిలో 17 మంది అమ్మాయిలు చైతన్యానందపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ద్వేషపూరిత భాషను వాడుతున్నారని, శృంగారభరిత టెక్ట్స్ మెసేజ్‌లు చేస్తున్నారని, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్‌కు లొంగిపోవాలని ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆగ్రాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు.