ఇంఫాల్: ఒక నదిపై ఉన్న కీలకమైన వంతెనను మిలిటెంట్లు పేల్చివేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఒక వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పుపెట్టారు. (militants blow up bridge) మణిపూర్‌లోని కామ్జోంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పలు గ్రామాలను జిల్లా కేంద్రంతో కలిపే బెయిలీ వంతెనను బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో మిలిటెంట్లు పేల్చివేశారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) వినియోగించి ఈ బ్రిడ్జిని పేల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమీపంలో పార్క్ చేసిన టెలికాం శాఖకు చెందిన వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పంటించారని అధికారులు తెలిపారు.
కాగా, ఫాంగే, చాట్రిక్ గ్రామాల మధ్య లోక్ నదిపై ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన ఈ వంతెన పొరుగు గ్రామాలను కామ్జోంగ్ జిల్లా కేంద్రంతో కలిపే ఏకైక రహదారి అని అధికారులు తెలిపారు. ఐఈడీతో మిలిటెంట్లు పేల్చివేయడంతో బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. దీంతో ప్రభావిత గ్రామాలకు రహదారి తెగిపోవడంతో రాకపోకలకు, నిత్యావసర సేవలకు అంతరాయం కలిగినట్లు వివరించారు.
మరోవైపు ప్రజా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం, రవాణా, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలిగించడం, ప్రజల కదలికలను నియంత్రించడం, స్థానిక ప్రజలలో భయాందోళనలు సృష్టించడం ఉద్దేశ్యంగా ఈ దాడి కనిపిస్తోందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనను ప్రజా భద్రత, రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పుగా పేర్కొన్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అయితే ఇప్పటి వరకు ఏ మిలిటెంట్ సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత ప్రకటించలేదు.