ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. పోలీస్ అవుట్‌పోస్టులపై దాడి చేశారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత బరాక్ నది ద్వారా సుమారు నాలుగు పడవల్లో తిరుగుబాటుదారులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఛోటోబెక్రా అవుట్‌పోస్ట్‌పై దాడి చేసి నిప్పుపెట్టారని చెప్పారు. ఆ తర్వాత లాంటై ఖునౌ, మోధుపూర్లోని పోలీస్ అవుట్‌పోస్టులపై కూడా దాడి చేశారని వెల్లడించారు.
కాగా, నది వెంబడి ఉన్న అనేక గ్రామాలపై కూడా తిరుగుబాటుదారులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టి సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీస్ కమాండోలు జిరిబామ్‌కు చేరుకున్నారు. పోలీస్ పోస్టులపై దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టిన మూకల కోసం గాలిస్తున్నారు.
మరోవైపు 59 ఏళ్ల వ్యక్తిని కుకీ తిరుగుబాటుదారులు హత్య చేశారు. దీంతో మళ్లీ జాతి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో జిరిబామ్ నగర శివార్లలో నివసిస్తున్న 250 మంది మైతీ వర్గం ప్రజలను అస్సాం రైఫిల్స్ సిబ్బంది శుక్రవారం ఖాళీ చేయించారు.