న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత సముద్ర తీరంలో ఊహించని దాడి జరిగింది. గుజరాత్ తీర అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. నౌక దెబ్బతిన్నట్టు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. దాడి సమయంలో నౌకలో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నది. గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టు తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో, వెరావల్ తీరానికి నైరుతి దిశగా 200 కిలోమీటర్ల దూరంలోని అరేబియా సముద్ర ప్రాంతంలో ఎంవీ కెమ్ ప్లూటో అనే నౌకపై దాడి జరిగిందని భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు ముడిచమురుతో ఈ నౌక వస్తుందని, డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు.
దాడి సమాచారంతో సాయం అందించేందుకు కోస్ట్‌గార్డు నౌక ఐసీజీఎస్ విక్రమ్‌ను ఘటనా స్థలికి పంపినట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. సమీప ప్రాంతాల్లోని అన్ని నౌకలను అలర్ట్ చేశామని తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ నౌక దెబ్బతిన్నదని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. భారత నౌకాదళ విమానం దాడికి గురైన నౌకను పరిశీలించి పెద్దగా ప్రమాదమేమీ లేదని తేల్చింది. నౌకను సురక్షితంగా తీరం చేర్చేందుకు కోస్ట్‌గార్డు గస్తీ నౌకలు బయలుదేరినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. అయితే, గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది కూడా వాళ్ల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. గత నెల హిందూ మహా సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో నౌకపై అనుమానిత డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇది చేసిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో హమాస్ మద్దతుదారుగా ఉన్న హౌతీలు నౌకలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నాయి. 35 వివిధ దేశాలకు సంబంధం ఉన్న 10 వాణిజ్య నౌకలను టార్గెట్‌గా చేసుకొని హౌతీలు 100కు పైగా డ్రోన్, క్షిపణి దాడులు చేశారని అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.