Hero Darshan | రామనగర (కర్ణాటక), జూన్ 14: హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఉన్న సంబంధంపై బీజేపీ నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి కేంద్ర మంత్రి కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన చన్నపట్నం అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ దర్శన్‌ను పోటీ చేయించాలని డీకే శివకుమార్, అతని సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ ప్రణాళికలు సిద్ధం చేశారని బీజేపీ నేత సీపీ యోగేశ్వర్ తెలిపారు. ‘చన్నపట్నం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్న నటుడు ఇప్పుడు జైలులో ఉన్నారు. అతడిని రంగంలోకి దింపి ప్రజలను ఆశ్చర్యపరుద్దామని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు మరో అనూహ్యమైన అభ్యర్థిని పోటీలోకి తేవడానికి ప్రయత్నిస్తుందేమో చూడాలి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, చన్నపట్నం నుంచి యోగేశ్వర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
కన్నడ హీరో దర్శన్ చేతిలో చిత్రహింసలకు గురై హతమైనట్టు భావిస్తున్న రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదిక వెలువడింది. హతుడు తీవ్ర రక్తస్రావం, షాక్ కారణంగా మరణించిన్టు పోస్టుమార్టం ద్వారా వెల్లడైంది. దర్శన్, అతని అనుచరుల చేతిలో దెబ్బలకు రేణుకాస్వామి హతమైనట్టు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దానిని నిర్ధారించేలా హతుని ఒంటిపై 15 గాయాలు ఉన్నట్టు నివేదిక తెలిపింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి నిందితులను కారులో తీసుకువచ్చిన రవి అనే డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హీరో దర్శన్‌కు పోలీస్ స్టేషన్లో సకల మర్యాదలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక ప్రభుత్వం కొట్టివేసింది.