Surgery : వచ్చీరాని వైద్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ క్లినిక్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ అందుబాటులో లేకపోయినా ఒక మహిళకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశాడు. ఆపరేషన్ వికటించడంతో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలోని ముస్రిఘరారీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ముస్రిఘరారీ పట్టణానికి చెందిన బబితా దేవి అనే 28 ఏళ్ల మహిళ.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం స్థానికంగా ఉన్న అనిషా హెల్త్‌కేర్ క్లినిక్‌కు వచ్చింది. దాంతో వైద్యుడు అందుబాటులో లేడని చెప్పి కాంపౌండర్ ఆపరేషన్ చేశాడు. కానీ ఆ ఆపరేషన్ వికటించి మహిళ మృతిచెందింది.
దాంతో క్లినిక్ సిబ్బంది అంబులెన్స్‌ను పిలిపించి మోహన్‌పూర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఏమైందని బబితాదేవి కుటుంబసభ్యులు అడిగితే.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మోహన్పూర్ ఆస్పత్రి వైద్యులు పరిశీలించి బబితాదేవి మరణించినట్లు ధృవీకరించారు.
దాంతో బబితాదేవి బంధువులు ఆమె మృతదేహాన్ని అనిషా క్లినిక్‌కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మోహన్పూర్కు తరలించే ముందు తాము పట్టుకుని చూస్తే బబిత దేహం చల్లగా ఉందని, ఆమె అప్పటికే చనిపోయిందని బంధువులు చెప్పారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి క్లినిక్ సిబ్బంది నాటకమాడారని అన్నారు.
కాగా, బబిత బంధువులు ఆందోళనకు దిగుతుండగానే అనిషా క్లినిక్ సిబ్బంది పరారయ్యారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముస్రిఘరారీ ఏరియాలో చాలా క్లినిక్‌లు వైద్యులు లేకుండానే నడుస్తున్నాయని, అర్హతలు లేని వాళ్లే శస్త్రచికిత్సలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.