న్యూఢిల్లీ: ఈజిప్ట్ దేశానికి భారత అంబాసిడర్‌గా సురేశ్ కె రెడ్డి(Suresh K. Reddy)ని నియమించారు. విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. అంబాసిడర్ సురేశ్ రెడ్డి.. 1991 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిస్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన బ్రెజిల్ అంబాసిడర్‌గా ఉన్నారు. తొలిసారి నిర్వహించిన ఏసియాన్ మల్టీలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సమావేశానికి అధినేతగా వ్యవహరించారు. బిమ్స్టెక్ సెక్రటేరియేట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఈజిప్ట్ అంబాసిడర్‌గా సురేశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
1991లో ఐఎఫ్ఎస్లో చేరిన తర్వాత సురేశ్ రెడ్డి ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. కైరో, మస్కట్, అబుదాబీ, ఇస్లామాబాద్, ఇరాక్‌లో పనిచేశారు. 2014లో జూన్ నుంచి డిసెంబర్ వరకు.. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక దౌత్యాధికారిగా ఇరాక్‌లో పనిచేశారు. భారతీయుల్ని సురక్షితంగా తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. విదేశాంగ శాఖలో ఎన్నో సున్నితమైన, సంక్లిష్టమైన పదవుల్లో చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లోని విదేశాంగ శాఖలతో ఆయన టచ్‌లో ఉన్నారు.