న్యూఢిల్లీ: చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఇటీవల జాతీయ భద్రతకు ఎదురవుతున్న తీవ్రమైన ప్రమాదం దృష్ట్యా ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడింది. సైనిక దళాల అవసరాలపై మీనమేషాలు లెక్కించడం తగదని తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తమకు ఎప్పటికప్పుడు నివేదించేందుకు మాజీ న్యాయమూర్తి ఏకే సిక్రీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. రూ.12 వేల కోట్లతో చేపట్టిన ఈ 900 కిలోమీటర్ల చార్ధామ్ ప్రాజెక్టు 4 పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌ను కలుపుతుంది. అన్ని కాలాల వాతావరణాన్ని తట్టుకునేలా రోడ్లు వేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.