Supreme Court | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిత్తరపోయింది. ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈడీ న్యాయవాదులు బిత్తరచూపులు చూశారు. ఈడీ దాఖలు చేసిన అభియోగాలు కోర్టులో రెండు నిమిషాలు కూడా నిలువవని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఏ ఆధారాలతో సిసోడియాను అరెస్టు చేశారని సూటిగా ప్రశ్నించింది. ఇంత ప్రాధాన్యమున్న కేసులో ఆధారాల వరుసక్రమాన్ని ఈడీ ఎందుకు సిద్ధం చేయలేకపోయిందని నిలదీసింది.
1. మీరు (ఈడీ) ఈ కేసులో ఆధారాల క్రమాన్ని సిద్ధంచేయాల్సి ఉన్నది. డబ్బు మద్యం లాబీ నుంచి ఫలానా వ్యక్తికి చేరిందని అంటున్నారు. ఎంతో రహస్యంగా సాగే ఇలాంటి కేసులో ఆధారాలు సేకరించటం కష్టమని మీతో మేం ఏకీభవిస్తాం. కానీ, ఆధారాల కోసం మీరు ఎక్కడ ప్రయత్నించారు?
2. నిందితుడికి ఒకసారి రూ.100 కోట్లు, మరోసారి రూ.30 కోట్లు ముట్టాయని మీరు అభియోగాలు మోపారు. ఈ డబ్బు మద్యం లాబీ నుంచే వచ్చినట్టు ఆధారాలెక్కడ? ఆ కుంభకోణంతో సంబంధం లేని వ్యక్తుల నుంచి కూడా ఈ డబ్బు వచ్చి ఉండవచ్చు కదా?
3. ఈ కేసులో నిందితుడైన దినేశ్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం తప్ప ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఉంటే అవెక్కడున్నాయి?
4. విధాన (మద్యం విధానం) నిర్ణయం మారిందని మేం అర్థంచేసుకొన్నాం. వ్యాపారానికి మంచి చేసే ఏ విధానాన్నైనా అందరూ సమర్థిస్తారు.
తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించే ప్రెషర్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అసంబద్ధమైనవైనా ఆర్థిక లావాదేవీలు లేని విధాన నిర్ణయాలు పెద్ద విషయం కాదు. అందులో ఆర్థిక లావాదేవీలుంటేనే నేరమవుతుంది.
5.మీరు నమోదుచేసిన అభియోగాలను బట్టి ఈ కేసులో మనీశ్ సిసోడియా ఎక్కడా ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు. ఆమ్ఆద్మీ పార్టీ సమాచార విభాగం అధిపతి, వ్యాపారవేత్త విజయ్‌నాయర్ మాత్రమే భాగస్వామి అయ్యారు. అలాంటప్పుడు మనీలాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియాను ఎందుకు అరెస్టు చేశారు? ఆ డబ్బు సిసోడియాకు చేరలేదు. ఒకవేళ ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఏదైనా కంపెనీతో ఆయనకు సంబంధాలుంటే అది ప్రత్యామ్నాయ బాధ్యత అవుతుంది. మనీలాండరింగ్ పూర్తిగా భిన్నమైనది?
6.సిసోడియా, నాయర్ ముడుపుల గురించి మాట్లాడుకోవటం మీరు చూశారా? ఈ అభియోగాలు ఆమోదయోగ్యమేనా? అప్రూవర్ వాంగ్మూలం ఒక అనుమానం మాత్రమేకదా? ఈ వాంగ్మూలం ఆమోదయోగ్యమేకానీ అసలైన ఆధారాలు కావాలి కదా? క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ కేసు రెండు నిమిషాలు కూడా నిలువదు.