న్యూఢిల్లీ, ఆగస్టు 13 : ‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’ అని గురువారం సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు కలిగిన ప్రాసెస్డ్ ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను అమర్చడంలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘తమ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకోవడం లేదా?, ప్రాసెస్డ్ ఆహారం ఉన్న ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను ముద్రించడంలో ఎందుకు విఫలమయ్యారు?’ అని సుప్రీంకోర్టు ఆగ్రహంతో ప్రశ్నించింది. లేబుల్స్ ప్రతిపాదనను అమలు చేయకపోవడానికి కేంద్రం ఇచ్చిన వివరణ పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తయారీదారులు అంటే ప్యాకెట్లపై లేబుల్స్ ముద్రించడానికి ఇష్టపడకపోవచ్చు. మీరెందుకు అయిష్టత చూపుతున్నారు? అని కేంద్రాన్ని నిలదీసింది. ఈ విషయంలో కార్పొరేట్ల నుంచి ఏమన్నా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? అని ప్రశ్నించింది. ‘ఇది పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు సంబంధించినది. ఈ విషయంలో తీసుకునే నిర్ణయాలు కార్పొరేట్ల ఒత్తిడి ప్రభావానికి లోనై ఉండరాదు’ అని జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
దీనిపై ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందా లేక మేమే ఆదేశాలు జారీ చేయాలా? అని సుప్రీంకోర్టు ఆగ్రహంతో ప్రశ్నించింది. ప్రతిపాదిత లేబులింగ్ వల్ల ప్రస్తుతమున్న పలు సంప్రదాయ ఆహారాలతో పాటు నమ్కీన్ లాంటి వాటిపై ‘రెడ్ వార్నింగ్ మార్క్’ వేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తరఫున వాదించిన ఏఎస్జీ బ్రిజేందర్ చాహర్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార పదార్థాలు తక్కువ ఉప్పు, చక్కెర, కొవ్వులు ఉంటాయని, అదే ప్రమాణాలు భారత సంప్రదాయ ఆహారానికి కూడా వర్తింపచేయాలని పేర్కొనడం సమంజసం కాదని పేర్కొన్నారు.దేశంలోని మూడో వంతు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు సంప్రదాయ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని, లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తే వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.ఈ సంద ర్భంగా దేశంలోని ఎంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్లను ఆరగించ గలరు, ఎంతమంది కురుకురేలు కొనగలరని న్యాయస్థానం ప్రశ్నిం చింది. ఇవన్నీ వేరువేరు అంశాలని, తాము ఏ ఉత్పత్తికి కూడా వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. కాగా, పరిశ్రమ తరపున వాదనలు విన్పించడానికి వచ్చిన న్యాయవాది స్పం దనను వినడానికి తిరస్కరించిన న్యాయ స్థానం ఆయన కేంద్రానికి వినతిపత్రం సమర్పించమని సూచించింది. లేబులింగ్ ప్రతి పాదనను అమలు చేయడానికి కేంద్రానికి రెండు వారాల గడువును ఇస్తూ, తదుపరి సారి తీర్పు వెలువరిస్తామని హెచ్చరించింది.
ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఆహార ఉత్పత్తుల ప్రచారం సందర్భంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కోరింది. ఈ మేరకు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లో.. ఉత్పత్తులు సురక్షితమైనవో, చట్టబద్ధమైనవో, సరిగ్గా ఆమోదించారో లేదో ముందుగా తనిఖీ చేయకుండా వాటి గురించి ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. ప్రజలు ఏమి తినాలో, ఏది తాగాలో నిర్ణయించడంలో ఇన్ఫ్లుయెన్సర్ల నేతృత్వంలోని ఆహార ప్రచారాలు ప్రధాన చోదకంగా మారిన క్రమంలో ఈ సలహా వెలువడింది.

ప్రముఖ క్రియేటర్లు ఇచ్చే సిఫార్సులను ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే లక్షలాది మంది వినియోగదారులు గుడ్డిగా అనుసరిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ పరిస్థితుల్లో క్రియేటర్ల ప్రభావం బాధ్యతతో కూడుకుని ఉండాలని పేర్కొంది. అసంపూర్తి, అర్థ సత్యాలతో ఆయా వస్తువులకు చేసే అతిశయోక్తి ప్రచారం వినియోగదారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. చివరకు వారి మాటలు నమ్మి వాటిని ఆరగించిన వినియోగదారుడు దాని నాణ్యత, రక్షణ విషయంలో మోసపోయి ఆర్థికంగా నష్టపోవడమే కాక, అనారోగ్యం పాలవుతున్నాడని పేర్కొంది.