న్యూఢిల్లీ: ఈవీఎంల ద్వారా కాకుండా.. పేపర్ బ్యాలెట్(Paper Ballot) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఎన్నికల వేళ ఏం జరుగుతోందంటే, ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపర్ కాలేదంటున్నారని, ఒకవేళ ఎన్నికల్లో ఓటమి చెందితే, అప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అయినట్లు చెబుతున్నారని సుప్రీం పేర్కొన్నది. జస్టిస్ విక్రమ్ నాథ్, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఇవాళ ఓ కేసులో తీర్పు ఇచ్చింది. మద్యం, డబ్బులు పంపిణీ చేసే అభ్యర్థిని ఎన్నికల్లో పాల్గొనకుండా అయిదేళ్ల పాటు బహిష్కరించేలా ఈసీ నిబంధనలు తీసుకురావాలని చేసిన అభ్యర్థనను కూడా కోర్టు కొట్టిపారేసింది.
పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేఏ పాల్ .. సుప్రీంకోర్టులో పిల్ వేశారు. మీరు వేసిన పిల్ ఆసక్తికరంగా ఉందని, ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని కోర్టు అడిగింది. అయితే సుమారు మూడు లక్షల మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించింన సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నాని పిటీషనర్ తెలిపారు. ఆ సమయంలో కోర్టు స్పందిస్తూ.. రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారని అడిగింది. మీకు అనుభవం ఉన్న రంగం వేరు కాదా అని కోర్టు చెప్పింది. దానికి పాల్ సమాధానం ఇస్తూ 150 దేశాల్లో తాను తిరిగానన్నారు. దానికి కోర్టు స్పందిస్తూ ఆయా దేశాల్లో పేపర్ బ్యాలెట్ ఉందా లేక ఈవీఎంలు ఉన్నాయా అని అడిగింది. విదేశాలు ఎక్కువ శాతం పేపర్ బ్యాలెట్‌కు మొగ్గుచూపినట్లు పిటీషనర్ చెప్పారు. భారత్ కూడా పేపర్ బ్యాలెట్‌ను తిరిగి అమలు చేయాలన్నారు.
అయితే ప్రపంచ దేశాలకు విరుద్ధంగా మనం ఎందుకు ఉండకూడదని కోర్టు ప్రశ్నించింది. మన దగ్గర ఎన్నికల్లో అవినీతి జరుగుతోందని, ఈసారి ఎన్నికల వేళ సుమారు 9వేల కోట్లు ఈసీ సీజ్ చేసిందని పాల్ తెలిపారు. ఒకవేళ మీరు చెప్పినట్లే పేపర్ బ్యాలెట్‌కు వెళ్తే, అవినీతి తగ్గుతుందా అని కోర్టు ప్రశ్నించింది. దానికి పాల్ సమాధానం ఇస్తూ.. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చు అని టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం జరుగుతుందని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గత సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు పాల్ వెల్లడించారు. చంద్రబాబు ఓడినప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అయినట్లు చెప్పారని, ఇప్పుడు వైఎస్ జగన్ ఓడారని, ఆయన కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయినట్లు చెబుతున్నారని ధర్మాసనం తెలిపింది.
ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు అందరికీ తెలుసు అని పిటీషన్ చెప్పారని, దానికి బెంచ్ సమాధానం ఇస్తూ.. ఏ ఎన్నికల్లోనూ తమకు డబ్బులు అందలేదని చెప్పింది. డబ్బు, మద్యం పంపిణీని ఎన్నికల వేళ నిలిపివేయాలని కోరుతూ పాల్ తన పిటీషన్ లో కోరారు. ఓటర్ల చైతన్యం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిటీషన్ తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. ఇదో విషాదభరిత పరిస్థితి అని, విద్యావంతుల్లో 32 శాతం మంది ఓటు వేయడం లేదని, ప్రజాస్వామ్యం ఇలా ఉంటే, భవిష్యత్తులో ఏమీ చేయలేమని పిటీషనర్ తెలిపారు.