Supreme Court | దీపావళి సెలవులను అనంతరం సోమవారం సుప్రీంకోర్టు వివాదాస్పద పౌరసత్వ (సవరణ)చట్టం (CAA)సహా దాదాపు 240 పిటిషన్లను విచారించనున్నది. ఇందులో చాలా వరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే కావడం గమనార్హం. ఈ 240 పిటిషన్లలో దాదాపు 232 పిటిషన్లు సీఏఏకి సంబంధించినవే. విశేషమేంటంటే.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మాత్రమే ఈ 232 పిటిషన్లను సోమవారం జాబితా చేసింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు త్రిసభ్య ధర్మాసనానికి పంపుతామని గతంలో సీజేఐ యూయూ లలిత్ ధర్మాసనం పేర్కొంది. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ వచ్చే నెల 8న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.
సీఏఏ అంశంపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రధాన పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లో సీఏఏ సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని, మతం ఆధారంగా ఓ వర్గాన్ని వేరుగా ఉంచుతూ.. ఇతర శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. చట్టం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని, ముస్లింలపై వివక్ష చూపుతుందని కూడా పిటిషన్లో పేర్కొంది. సీఏఏ.. రాజ్యాంగ చెల్లుబాటును ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్, పీస్ పార్టీ, అసోం గణ పరిషత్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, జమాయత్ ఉలేమా-ఎ-హింద్, జైరాం రమేశ్, మహువా మొయిత్రా, దేవ్ ముఖర్జీ, అసదుద్దీన్ ఒవైసీ, తహసీన్ పూనావల్లా, కేరళ ప్రభుత్వం సహా పలువురు సవాల్ చేశారు. సీఏఏ ప్రాథమిక హక్కులపై దాడని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈ చట్టం మతం, భౌగోళిక పరిస్థితుల్లో రెండు వర్గాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2020లో సీఏఏ అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు కావడంతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకు స్టే ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అలాగే సీఏఏపై దాఖలైన పిటిషన్లతో పాటు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌పై సైతం సుప్రీంకోర్టు విచారించనున్నది. అంతే కాకుండా మనీలాండింగ్, పన్ను ఎగవేత వంటి వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను ఏడాదిలోగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక అవినీతి నిరోధక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ వేసిన మరో పిల్‌ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. అదే సమయంలో లా కమిషన్‌ను ‘చట్టబద్ధమైన సంస్థ’గా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పీఐఎల్‌ను సైతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనున్నది. అలాగే ప్యానెల్‌కు చైర్పర్సన్, సభ్యులను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే రేపు సుప్రీంకోర్టు ముందుకు పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, బ్యాలెట్ పేపర్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నుంచి పార్టీల గుర్తులను తొలగించాలని, అభ్యర్థుల వయస్సు, విద్యార్హత, ఫొటోలను ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషన్ దాఖలవగా.. ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది.