న్యూఢిల్లీ : బాణసంచాపై నిషేధాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. దేశ రాజధాని నగరం ప్రాంతంలోని ప్రజలు పరిశుభ్రమైన గాలిని పీల్చేందుకు అర్హులైనపుడు, ఇతర నగరాల ప్రజలకు ఎందుకు ఆ అర్హత లేదని ప్రశ్నించారు. బాణసంచా విధానం యావత్తు దేశానికి వర్తించే విధంగా ఉండాలన్నారు. “ఢిల్లీ ప్రజలు దేశంలోని విశిష్ట వ్యక్తులు కాబట్టి వారికి మాత్రమే వర్తించే విధానం ఉండకూడదు.
నిరుడు శీతాకాలంలో నేను అమృత్సర్లో ఉన్నాను, అక్కడి కాలుష్యం ఢిల్లీలో కన్నా తీవ్రంగా ఉంది. బాణసంచాను నిషేధించవలసి వస్తే, దేశవ్యాప్తంగా నిషేధించాలి” అని సీజేఐ చెప్పారు. సీనియర్ అడ్వకేట్ అపరాజిత సింగ్ సీజేఐకి మద్దతు పలికారు. విశిష్ట వ్యక్తులు తమకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోగలుగుతారన్నారు. ఢిల్లీలో కాలుష్యం ఉంటే, వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోతారన్నారు. బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్కు నోటీసులిచ్చింది.