Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బెయిల్ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కేసును జస్టిస్ బేల ఎం త్రివేది. జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట జాబితా చేసింది. కేసు రెగ్యులర్ కోర్టులో విచారణకు వచ్చిందని జస్టిస్ బేల ఎం త్రివేది పేర్కొన్నారు.
సత్యేందర్ జైన్ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట కేసును ప్రస్తావించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ మాజీ మంత్రికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ తదుపరి విచారణ వరకు కొనసాగుతుందంటూ కేసు విచారణను వాయిదా వేసింది. అంతకు ముందు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బేలా ఎం త్రివేది కేసు విచారించారు. గత విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేమని కోర్టు పేర్కొంది.
అయితే, కేసును విచారించే ధర్మాసనం సమావేశం కాలేదని.. వచ్చే నెలకు కేసును వాయిదా వేయాలని కోరారు. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రిమాండ్‌లో ఉండగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. జులై 21న శస్త్ర చికిత్స జరిగింది. మే 26న మనీలాండరింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పలు షరతులతో ఆరువారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్‌ను పలుసార్లు పొడిగించింది.