Supreme Court | సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. జులై 31న ఇచ్చిన తన ఉత్తర్వులో సంక్షేమ పథకాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలను ఉపయోగించకూడదని డీఎంకే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ అయిన ఏఐఏడీఎంకే నాయకుడు సీవీ షణ్ముగంకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్ వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం రూ.10 లక్షల జరిమానా విధించింది. తమిళనాడు సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సరికాదని, చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోలను వినియోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కొత్తగా తీసుకురానున్న సంక్షేమ పథకాల్లో ప్రస్తుతం జీవించి ఉన్న నాయకుల పేర్లు వాడొద్దని.. పథకాలపై ప్రచారం చేసుకునే సమయంలో మాజీ సీఎంల ఫొటోలు, పార్టీ జెండాలను ఉపయోగించకుండా నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎన్నో రాష్ట్రాల్లో నాయకుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టారని.. దీనిపై ఎలాంటి న్యాయపరమైన నిషేదాజ్ఞలు లేవని ధర్మాసనం ఎదుట తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. పిల్ దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిటిషనర్‌కు ఆందోళన ఉంటే.. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించింది. పలు పథకాలకు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు ఉపయోగించుకోవచ్చని సుప్రీం గతంలో అనుమతి ఇచ్చిందని.. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని.. రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేసుకోవద్దంటూ హెచ్చరిస్తూ పిటిషనర్‌కు రూ.10లక్షల జరిమానా విధించింది.