Supreme Court | రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1976లో రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను జోడించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణుశంకర్ జైన్ పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతవారం వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, పిటిషన్ను తిరస్కరించిన సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా ‘పిటిషన్ను వివరంగా విచారించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. 1976లో రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం తదితర పదాలను చేర్చారని.. ఇక 1949లో ఆమోదించిన రాజ్యాంగానికి ఎలాంటి తేడా లేదని సీజేఐ పేర్కొన్నారు.
1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సెక్యులరిస్ట్, సోషలిస్ట్, సమగ్రత పదాలను చేర్చారు. అయితే, రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ పిటిషనర్లు సుబ్రమణ్య స్వామి, విష్ణుశంకర్ జైన్, బలరాం సింగ్, అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. రెండు పదాలను తొలగించాలని కోరారు. సవరణ జరిగిన సమయంలో పార్లమెంట్లో చర్చ జరుగలేదని.. 1975 నుంచి 1977 మధ్య ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఈ సవరణ చట్టబద్ధతను ప్రశ్నించారు. పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం గత శుక్రవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆయా పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలకు వివరణలు ఉన్నాయని.. వాటిని వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని.. సమానత్వం అనే అంశాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. దాన్ని మరో రకంగా చూడొద్దని.. అప్పుడు వేరు అర్థం వస్తుందంటూ చెప్పింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ‘సెక్యులరిజం’ అనేది అంతర్భాగమని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. 1994 నాటి ఎస్ఆర్ బొమ్మై కేసులోనూ ఇదే చెప్పినట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంట్ ఇస్తుందని.. పీఠికకు సైతం ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది.