న్యూఢిల్లీ, జూన్ 30: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న ప్రయోగమేనని, దీని ప్రభావం వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టమవుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కార్యక్రమంపై జరుగుతున్న విస్తృత చర్చ, ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇథనాల్‌ను అధిక మొత్తంలో కలపడం వల్ల పాత వాహనాలు దెబ్బతినడంతోపాటు ఇంధన సామర్థ్యం కూడా తగ్గుతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ20 పెట్రోల్‌కు యాంత్రిక నష్టానికి సంబంధం ఉందని చెప్పడానికి గట్టి ఆధారాలు లేవని, ఈ విధానం భారతదేశ ఇంధన భద్రతకు, రైతులకు, పర్యావరణానికి మొత్తంగా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నది.
2025-26 సరఫరా సంవత్సరానికి ఇథనాల్ కేటాయింపులకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. జూన్ 23 నాటి తన ఉత్తర్వులో టెండర్ ప్రక్రియను ఖరారు చేయడానికి ముందే తమ ఇథనాల్ కేటాయింపును పెంచాలని కోరుతూ ఒక డిస్టిలరీ చేసిన అభ్యర్థనను పరిశీలించాలని హైకోర్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన(ఓఎంసీలు) బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీలను ఆదేశించింది.
పెట్రోల్‌లో ఈ-20పై ఈ ఆదేశం విస్తృత ప్రభావాలను చూపే అవకాశం ఉందని బీపీసీఎల్ సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదిస్తూ ఇథనాల్ కేటాయింపుల ప్రక్రియ 2025 అక్టోబర్‌లోనే పూర్తయిందని, వ్యక్తిగత కేటాయింపులను తిరిగి ప్రారంభించడం దేశవ్యాప్త కార్యక్రమానికి అడ్డు తలుగుతుందని హెచ్చరించారు.