న్యూఢిల్లీ, అక్టోబర్ 9: జుడిషియల్ సర్వీసులో చేరడానికి ముందు న్యాయవాదిగా ఏడేళ్ల అనుభవం ఉన్న జుడిషియల్ అధికారి జిల్లా జడ్జీగా నియమితులు కావడానికి అర్హులని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
జుడిషియల్ సర్వీసెస్లో ఉన్న సభ్యులకు అన్యాయం జరిగిందని, జిల్లా జడ్జీల పోస్టుల కోసం జరిగే నియామక ప్రక్రియలో వారిని పాల్గొనకుండా అవరోధం ఏర్పడిందని ధర్మాసనం పేర్కొంది. బార్ కోటా కింద దరఖాస్తు చేసుకోకుండా జుడిషియల్ అధికారులను అడ్డుకుంటూ 2020లో ధీరజ్ మోర్ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. గతంలో జరిగిన నియామక ప్రక్రియలను మినహాయించి భవిష్యత్తులో జరిగే జిల్లా జడ్జీల నియామకాలకు నేటి తమ తీర్పు వర్తిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.