Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసే మనీలాండరింగ్ కేసుల్లోనూ (పీఎంఎల్ఏ కేసులు) ‘బెయిల్ నియమం’ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కస్టడీ సమయంలో నిందితులు చేసే నేరారోపణలు సాక్ష్యాలు కాబోవని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని కీలక ఆధారాలుగా పరిగణించి కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణల వాంగ్మూలాలు సాక్ష్యాలుగా చెల్లవంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసు మొత్తంగా నీరుగారిపోయినట్టేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మద్యం కేసులో కస్టడీలోని నిందితులు ఇచ్చిన నేరారోపణ వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకొన్నట్టు ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు.. సాక్ష్యాలు, ఆధారాలు ఎలా అవుతాయని నిలదీసింది. విచారణ సరైన పద్ధతిలో జరిగిందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీలోని నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలనే సాక్ష్యాలుగా చేసుకొని ‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసు దర్యాప్తు జరిగిందని ఈడీ, సీబీఐ వ్యాఖ్యలతో స్పష్టమైంది. నిందితుల వాంగ్మూలాలు చెల్లవంటూ సుప్రీం తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. వీటన్నింటినీ విశ్లేషిస్తే.. ‘ఢిల్లీ మద్యం పాలసీ కేసు’ నీరుగారిపోవడం తప్ప మరో మార్గం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ప్రేమ్ ప్రకాశ్.. ఈ వ్యవహారంలో నేరం చేసినట్లు గానీ.. బెయిల్‌పై బయటికొస్తే అతను సాక్షులను ప్రభావితం చేస్తాడన్నట్టు గానీ చెప్పడానికి ప్రాథమిక ఆధారాల్లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.