Supreme Court | న్యూఢిల్లీ, జనవరి 18: లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో వాస్తవికంగా అలాగే జరుగుతుందని కాని బాధితులందరూ ఒకే రకంగా ప్రతిస్పందిస్తారని కాని చెప్పలేమని జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. లైంగిక దాడి కారణంగా శారీరకంగా గాయపడతారని భావించడం సాధారణ అపోహని ధర్మాసనం స్పష్టం చేసింది. భయం, దిగ్భ్రాంతి, సామాజిక కళంకం లేదా నిస్సహాయత వంటివి ప్రభావం చూపించే ఆ ఆపత్కాలంలో బాధితులు వేర్వేరుగా స్పందిస్తారని ధర్మాసనం తెలిపింది.
జెండర్ స్టీరియోటైప్స్(మూస పద్ధతులు)పై సుప్రీంకోర్టు 2023లో ప్రచురించిన హ్యాండ్‌బుక్‌ను ధర్మాసనం ఉటంకిస్తూ తమకు ఆపద ఎదురైన సందర్భాలలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తారని తెలిపింది. తనపై లైంగిక దాడికి పాల్పడినపుడు తన వ్యక్తిగత మనస్తత్వం ప్రకారం మహిళ భిన్నంగా స్పందించవచ్చని, బాధితురాలు ప్రవర్తనను ఇది ఒప్పు లేదా ఇది తప్పు అని తీర్పు ఇవ్వలేమని ధర్మాసనం వివరించింది. 1998లో పెండ్లి పేరుతో ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి అపహరించిన కేసులో బాధితురాలి ఒంటిపై ఎక్కడా వాపులు కాని, గీతలు కాని లేవన్న వైద్యుడి నివేదిక ఆధారంగా జార్ఖండ్ హైకోర్ట్ కేసు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్ట్ తప్పు పట్టింది.
ఖైదీలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి జైళ్ల పరిపాలనను సంస్కరించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అధికరణ 21 ప్రకారం ఖైదీలు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించేలా మెరుగైన వాతావారణం కల్పించేలా జైళ్ల సంస్కృతిని సృష్టించడానికి పరిపాలనను సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గ్యాంగ్‌స్టర్ ఖైదీ వికాస్ తివారీని ఒక జైలు నుంచి వేరే రాష్ట్రంలోని జైలుకు చేసిన బదిలీని కొట్టివేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కన పెట్టింది.
ఖైదీగా ఒక వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతాడని రాష్ట్రం భావిస్తున్నదని, అయితే ఒక వ్యక్తిగా, మనిషిగా స్వేచ్ఛను కొనసాగించే హక్కును అతడు కొనసాగించగలడని తెలిపింది. ఖైదీ అయిన ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ కనీస అవసరాలను అతడికి అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఖైదీల సంస్కరణలు, పునరావాసం లక్ష్యాలను ప్రభుత్వాలు శ్రద్ధగా కొనసాగించాలని కోరింది. ఖైదీల ప్రాథమిక హక్కుల రక్షణ జైళ్ల పరిపాలన వ్యవస్థపై ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఆత్మహత్యలకు ప్రేరేపించారనే నేరాన్ని యాంత్రికంగా మోపవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన బాధితుడి కుటుంబం మనోభావాలను శాంతింపజేయడానికి ఇతర వ్యక్తులపై ఐపీసీ- 306ను ప్రయోగించకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమోదయోగ్యం కాని విచారణ ప్రక్రియ దుర్వినియోగమై అమాయకులు దానికి బలి కాకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘పార్టీల మధ్య సంభాషణలు, చర్యలను వాస్తవిక దృక్కోణంలో విచారించాలి’ అని ధర్మాసనం తెలిపింది.
2022 అక్టోబర్ 11న ఓ వ్యక్తి బ్యాంకు రుణం చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు మేనేజర్ మహేంద్ర వేధింపుల కారణంగానే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు అతను లేఖ రాశాడు. అయితే బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించాలని మాత్రమే ఆ వ్యక్తిని తాను అడిగానని, తన చర్యల ద్వారా అతడు ఆత్మహత్యలకు పాల్పడేలా చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవని మహేంద్ర సుప్రీంకోర్టుకు తెలిపారు.