డెహ్రాడూన్ : 70 ఏండ్ల భూ వివాదం.. నాలుగు తరాల న్యాయ పోరాటం.. మధ్యలోనే చనిపోయిన భూ యజమాని.. ఎట్టకేలకు సుప్రీం తీర్పుతో బాధితులకు దక్కిన న్యాయం. ఇదంతా ఉత్తరాఖండ్‌లోని నర్సీపూర్ కులాన్ గ్రామంలోని భూ వివాదం చుట్టూ జరిగిన తతంగం. గ్రామానికి చెందిన సరాఫత్ అలీ పూర్వీకులు 1957లో 15.5 బిఘాల భూమిని కొన్నారు. కానీ అప్పుడు మ్యుటేషన్ చేసుకోలేదు. 1980లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు అంగీకరించారు. 1991లో జరిగిన భూముల పునఃవ్యవస్థీకరణలో ఆ భూమి అమ్మినవారి పేరు మీదికి మారింది. రికార్డుల్లో వారి పేర్లే చూపించాయి. దీంతో సరాఫత్ అలీ కుటుంబం అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ చట్టాలకు అనుగుణంగా భూమి కొనుగోలు జరుగలేదని.. సరాఫత్ అలీ సాక్ష్యాల్లో తేడాలున్నాయంటూ అధికారులు మ్యుటేషన్‌ను తిరస్కరించారు.
దీంతో ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా అలీకి న్యాయం దక్కలేదు. అధికారులనే కోర్టు సమర్థిస్తూ 1957 నాటి సేల్ డీడ్ చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. పలు దఫాలుగా విచారణ అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అంజారియాలు తుది తీర్పు వెల్లడించారు. సాక్ష్యాల్లో చిన్న వ్యత్యాసాలున్నాయంటూ సేల్‌డీడ్‌ను కొట్టేయడం కరెక్టు కాదని.. సరాఫత్ అలీ కుటుంబానికే భూమి దక్కుతుందంటూ తీర్పు ఇచ్చింది. ఈ న్యాయపోరాటం మధ్యలోనే అలీ చనిపోయాడు. ఆయన వారసులు పోరాటాన్ని కొనసాగించడంతో భూమి వారి సొంతం అయింది.