Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభించగా, రెండు భాగాలు కలిపి రూ.3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. అయితే జపాన్ మార్కెట్లో మాత్రం ఈ సినిమా ప్రారంభ కలెక్షన్లు నిరాశ కలిగించాయి. జూలై 10న జపాన్లో సుమారు 80 స్క్రీన్లలో గ్రాండ్గా విడుదలైన ‘ధురందర్’కు విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. రణవీర్ సింగ్ అభిమానులతో పాటు భారతీయ సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకాదరణ లభించలేదు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదలైన తొలి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 57 థియేటర్లలో ఈ చిత్రాన్ని కేవలం 449 మంది ప్రేక్షకులు మాత్రమే వీక్షించారు. సాయంత్రం, రాత్రి షోలతో కలిపినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. మొత్తం తొలి రోజు 80 స్క్రీన్లలో కేవలం 900 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కలెక్షన్లతో వారాంతంలో జపాన్ బాక్సాఫీస్ టాప్-25 చిత్రాల జాబితాలో కూడా ‘ధురందర్’ స్థానం సంపాదించలేకపోయిందని తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇటీవల జపాన్లో విడుదలైన ‘పుష్ప 2’ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ చిత్రం తొలి రోజు 886 టికెట్లు మాత్రమే విక్రయించగా, ‘ధురందర్’ 900 టికెట్లతో స్వల్పంగా మెరుగైన ఆరంభాన్ని నమోదు చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అక్కడ భారీ ఓపెనింగ్ సాధించలేకపోవడం విశేషం.
ఇక జపాన్లో అత్యధిక తొలి రోజు టికెట్ విక్రయాలు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే 8,230 టికెట్లు విక్రయించి ఇండియన్ సినిమాలకు కొత్త రికార్డు సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జపాన్లో తొలి రోజు ఓపెనింగ్స్ పరంగా ‘సాహో’, ‘కల్కి 2898 AD’, ‘పఠాన్’, ‘సలార్’, ‘జవాన్’, ‘రంగస్థలం’, ‘దేవర’, ‘బాహుబలి 2’, ‘టైగర్ 3’ వంటి చిత్రాలు మంచి ప్రదర్శన కనబరిచాయి. ముఖ్యంగా ‘టైగర్ 3’ తొలి రోజు సుమారు 1,300 టికెట్లు విక్రయించి ఈ జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ‘ధురందర్’కు వచ్చిన ఈ స్పందన ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సినిమా దీర్ఘకాలంలో వర్డ్ ఆఫ్ మౌత్తో పుంజుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జపాన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తర్వాతి రోజుల్లో ఈ చిత్రం మెరుగైన వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.