న్యూఢిల్లీ: చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్లో ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనంతకాలం వాటిని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో పేర్కొన్న ‘సాధ్యమైనంత త్వరగా’ అన్న పదానికి ఎలాంటి ప్రయోజనము ఉండదని పేర్కొంది. రాష్ట్రపతి నివేదనపై రాజ్యాంగ ధర్మాసనం గురువారం కోర్టు విచారణను కొనసాగించింది. రాజ్యాంగ నిర్మాతలు ఆరు వారాల పరిమితిని ఉద్దేశ పూర్వకంగానే ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పద బంధంతో భర్తీ చేశారని, ఆ పదానికి తక్షణం అని అర్థమని డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నారని, ఈ పద బంధాన్ని విస్మరించవచ్చా? అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన ద్రవ్య బిల్లులకు సైతం ఆమోదం తెలపకుండా తన వద్దనే ఉంచుకుంటే, ఆ చర్య గవర్నర్ను రాష్ర్టానికి ‘సూపర్ చీఫ్ మినిస్టర్’గా మారుస్తుందని తమిళనాడు తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. బిల్లుకు ఆమోదం తెలపకుండా శాశ్వతంగా నిలిపివేసే అధికారం గవర్నర్కు కనుక కల్పిస్తే అది ఆర్టికల్ 200ను ఎగతాళి చేయడమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 200 అందిస్తుంది. బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసేందుకు ఈ అధికరణ వీలు కల్పిస్తుంది.
రాష్ట్ర నిర్వాహక వ్యవస్థ, రాష్ట్ర శాసన వ్యవస్థపై గవర్నర్ ఆధిపత్యం ప్రదర్శించలేరని తమిళనాడు ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అది ఒక ఒరలో రెండు కత్తులు ఇమిడ్చినట్లుగా ఉంటుందని పోల్చింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియచేసేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా అన్న రాజ్యాంగ ప్రశ్నలను లేవనెత్తిన రాష్ట్రపతి నివేదనపై సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఎదుట తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ గురువారం వాదనలు వినిపించారు.
ఇది ఒక ఒరలో రెండు కత్తులుండటమే. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తన ప్రజాస్వామిక బాధ్యతల నిర్వహణకు ఇది విరుద్ధం అని సింఘ్వీ తెలిపారు. తాను కూడా మొదటి నుంచి ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్ని అడుగుతున్నానని సీజేఐ గవాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరితంగా బిల్లులపై గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని రాజ్యాంగాన్ని రూపొందించిన సభ్యులు ఆలోచించి ఉంటారా అని సీజేఐ ప్రశ్నించారు. ఒకవేళ అదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశమైతే దాన్ని మనం విస్మరించగలమా అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా జోక్యం చేసుకుంటూ కోర్టు చెబుతున్న ఉదాహరణను బట్టి గవర్నర్ తక్షణమే స్పందించాలని మీరు ఆశిస్తున్నారా అని ధర్మాసనాన్ని అడిగారు.
దీనికి సీజేఐ స్పందిస్తూ తక్షణమే కాదని, సహేతుకంగా ఉండాలని అన్నారు. మెహతా జవాబిస్తూ ఒక్కో కేసులోని వాస్తవాలను బట్టి గడువు ఉంటుందని చెప్పారు. కాని బిల్లుపై ఎటువంటి సమ్మతి తెలియచేయకుండా ఆరు నెలలపాటు గవర్నర్ తన వద్దనే ఉంచుకోవడం మాత్రం సమర్థనీయం కాదని సీజేఐ స్పష్టం చేశారు. బిల్లుల మంచిచెడ్డల జోలికి నేను వెళ్లను. ఆరు నెలలు లేక ఏడాదికిపైగా బిల్లులను పెండింగ్లో ఉంచడం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ సమర్థనీయం కాదు అని సీజేఐ స్పష్టం చేశారు.